పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే.. మంత్రి కీలక ఆదేశాలు

... -


October 26, 2025 వర్షాల వల్ల తడిసిన పత్తిని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తేమ శాతం నిబంధనను సడలించి, రైతులు దళారుల వద్ద మోసపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోళ్ల తర్వాత మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.

తెలంగాణ పత్తి రైతులకు గుడ్‌న్యూస్. వర్షాల కారణంగా తడిసి ఇబ్బందులు పడుతున్న పత్తి రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. శనివారం సచివాలయంలో వివిధ పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి.. సాధారణంగా పత్తిలో తేమ శాతం 8-12 శాతం వరకు ఉండాలనే నిబంధనను సడలించాలని సీసీఐ అధికారులకు సూచించారు.

వర్షాల నేపథ్యంలో తడిసిన పత్తిని రైతులు ఆరబెడుతున్నా తేమ శాతం తగ్గడం లేదని.. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నా కూడా మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. రైతులు దళారుల వద్దకు వెళ్లి మోసపోకుండా, కేవలం సీసీఐ కొనుగోలు కేంద్రాలలోనే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పత్తిలో తేమ శాతంపై, అలాగే కొనుగోలు ప్రక్రియలో ఉన్న 'ఎల్1, ఎల్2 మ్యాపింగ్' విధానంపైనా రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి. ఈ-నామ్ (e-NAM) సర్వర్‌లో ఏర్పడుతున్న సమస్యతో కొన్ని జిల్లాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.

కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలకు నియమించిన నోడల్ అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని మంత్రి నిర్దేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అవుతున్న మొక్కజొన్నను నిరోధించాలని మార్కెటింగ్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానిక రైతులు నష్టపోకుండా అక్రమ రవాణాను కట్టడి చేయాలని స్పష్టం చేశారు. మొత్తంగా, రైతులు నష్టపోకుండా ప్రతి గింజకూ మద్దతు ధర దక్కేలా, కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక పత్తి కొనుగోళ్ల తర్వాత మూడ్రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Share to ....: 40    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 40195902

Saying...........
The number of a person-s relatives is directly proportional to his fame.





Cotton Group